సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు..
గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ చాహత్ బాజ్పాయి..
కాకతీయ, హనుమకొండ :సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమాచార హక్కు వారోత్సవాలు 2026 కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ప్రజలకు ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, సమాచార హక్కు చట్టం లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాల్లో కనబరిచిన పనితీరు ఈ గుర్తింపునకు దోహదపడింది. సమాచార హక్కు చట్టం అమలులో హనుమకొండ జిల్లాకు అవార్డు లభించడం ప్రజాకేంద్రిత పాలనను మరింత బలోపేతం చేసేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని కలెక్టర్ చాహత్ బాజ్పాయి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయిని పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు. ఈ అవార్డు జిల్లాలోని అధికార యంత్రాంగానికి మరింత బాధ్యతతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు.

