మహిళా భద్రతపై రాహుల్ మాటలు డ్రామాలేనా?
జేఎన్యూ ఘటనపై మౌనం వీడాలి
బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మహిళా మోర్చా నేతల డిమాండ్
కాకతీయ, వరంగల్ : మహిళల హక్కులు, భద్రతపై పెద్దపెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థినిపై లైంగిక దుర్వ్యవహార ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ మహిళా మోర్చా నాయకులు ప్రశ్నించారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ చౌరస్తాలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ ఆంగోమ్ చా బిమోల్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు టేకుమట్ల రేణుక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ జేఎన్యూ ఘటనపై పారదర్శకమైన, నిష్పాక్షికమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలితోపాటు ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల హక్కులు, పితృస్వామ్య వ్యవస్థ నిర్మూలన గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, సొంత పార్టీ ఎంపీపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదని మహిళా మోర్చా నేతలు నిలదీశారు. మహిళల గౌరవం, భద్రత రాజకీయ నినాదాలకే పరిమితం కాకూడన్నారు. ఘటనపై నిజాలు వెలుగులోకి వచ్చి బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు జి. మంజుల రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మార్తా ఉషారాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పిరాల శైలశ్రీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీష్, రాష్ట్ర నాయకుడు త్రీలోకేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు బైరి నాగరాజు, కనుకుంట్ల రంజిత్ కుమార్, అంకాల జనార్ధన్, నోముల రతన్, అపురూప సాయి, నవజీవన్, మహిళా నాయకురాళ్లు పిట్ట సరస్వతి, దేవక్క, సాగరిక, స్వరూప, శోభ, రాజేశ్వరి, దీప ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

