రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి
లో-వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయి..
పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
చెల్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా
కాకతీయ, భూపాలపల్లి : రైతులకు న్యాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు, లో-వోల్టేజీతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మోటార్లు కాలిపోతూ పంటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గణపురం మండలం చెల్పూర్లో జాతీయ రహదారి 353పై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల రైతులు చేపట్టిన ధర్నాకు ఆయన హాజరై మద్దతు తెలిపారు. వరి పంట చివరి దశలో ఉండటంతో పాటు మిర్చికి నీటి అవసరం ఎక్కువగా ఉందని, ఈ కీలక సమయంలో విద్యుత్ సరఫరాలో కోతలు విధించడం రైతులకు నష్టం కలిగిస్తోందని అన్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందించలేని పరిస్థితిలో కనీసం 15 నుంచి 16 గంటలైనా నాణ్యమైన సరఫరా చేయాలని గండ్ర కోరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా మధ్యలో పలుమార్లు కోతలు విధిస్తున్నారని విమర్శించారు. ధర్నా చేస్తామని రైతులు ప్రకటించిన తర్వాత రాత్రిపూట విద్యుత్ సరఫరా చేసినప్పుడు సాధారణ రోజుల్లోనూ అదే విధంగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఎన్పీడీసీఎల్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయాలని కోరారు. అవసరమైతే గృహ, పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో సర్దుబాట్లు చేసైనా వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యాప్ విధానం వల్ల యూరియా, డీఏపీ ఎరువులు పొందడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని గండ్ర విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశం కాదని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ధర్నా చేపట్టినట్లు స్పష్టం చేశారు.


