బాలికలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి
సైబర్ వేధింపులపై భయపడకుండా ఫిర్యాదు చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పిలుపు
కాకతీయ, హన్మకొండ : బాలికలు తమ హక్కులు, రక్షణపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, సైబర్ వేధింపులకు గురైతే భయపడకుండా తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా షీ టీమ్స్ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో బాలికా సంఘాలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్స్ ఏసీపీ సదయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలికల భద్రత, మహిళా రక్షణ, వ్యక్తిగత అభివృద్ధి, సైబర్ నేరాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి
ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ కౌమార దశలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా అధిగమిస్తూ జీవిత లక్ష్యాలను సాధించాలని బాలికలకు సూచించారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు మానసిక, భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవాలని, అవసరమైనప్పుడు షీ టీమ్స్ సహాయం పొందాలని తెలిపారు. సైకాలజిస్ట్ డాక్టర్ బారుపాటి గోపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాను విచక్షణతో వినియోగిస్తూ సైబర్ మోసాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్. రాధిక మాట్లాడుతూ కౌమార దశలో కలిగే శారీరక, మానసిక మార్పులపై అవగాహన కలిగి ఉండాలని, సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా వైద్యుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. బాలికల భద్రత, సాధికారత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు డీసీపీలు బాలస్వామి, ఏసీపీలు సదయ్య, వెంకటరమణ, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సువర్ణ, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ ఓ. రమేష్, భరోసా కేంద్రం ఎస్ఐ కిరణ్మయి, షీ టీమ్స్ ఆర్ఎస్ఐ స్వాతి, ఎస్ఐ రామారావు తదితర పోలీస్ అధికారులు, తొమ్మిది మండలాల బాలికలు, మెప్మా, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

