పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర నిఘా
వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సఖ్వార్ ఆదేశం
కాకతీయ, నల్లబెల్లి : పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సఖ్వార్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన డీసీపీ రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీసీపీ ఆదేశించారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి, సకాలంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, పారదర్శకత పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై నిరంతరం నిఘా ఉంచాలని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పటిష్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని డీసీపీ పేర్కొన్నారు. గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా పనిచేయాలని, నేరాల నియంత్రణకు ప్రాధాన్యమివ్వాలని దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, నల్లబెల్లి సీఐ శంకర్రావు, ఎస్సై సాయి ప్రసన్నకుమార్‌తో పాటు ఖానాపురం, చిన్నగూడూరు, దుగ్గొండి పోలీస్స్టేషన్ల ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

