బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు
ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే
మూడేండ్లుగా సొంత ఖర్చులతో వసతులు కల్పిస్తున్న యువత
14వ డివిజన్ సుందరయ్య నగర్లో వేడుకలపై చిన్నచూపు
కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ సుందరయ్య నగర్ లో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువయ్యాయి. కొన్నేండ్లుగా సుందరయ్య నగర్ నుంచి కాశిబుగ్గ లో జరిగే బతుకమ్మ వేడుకలకు వెళ్లేందుకు మహిళలు, యువతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత రెండు సంవత్సరాలుగా స్థానిక యువత సొంత ఖర్చులతో సుందరయ్య నగర్ ఎన్టీఆర్ నగర్ మధ్య గల ఖాళీ స్థలంలో వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో 500 మందికి పైగా మహిళలు పాల్గొంటున్నారు. ఈ ఏడాది ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేయాలని స్థానిక యువత వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లింది. ఆయన స్పందించి వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. అయినప్పటికీ గతంలో అక్కడ జిడబ్లూఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయలేదు అనే సాకుతో వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినా కేవలం జేసీబీ ని పంపించి, డస్ట్ మాత్రమే పోశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక యువతే సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానికులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకుంటే జిడబ్ల్యుఎంసీ ఉన్నది ఎందుకని స్థానికులు విమర్శిస్తున్నారు. కాశిబుగ్గలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం కదా అంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని, స్థానికులు, యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీడబ్ల్యూ ఎం సీ అధికారులు ఇప్పటికైనా స్పందించి అవసరమైన లైటింగ్, సౌండ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సౌకర్యాలు కూడా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

