రాజ్యాంగ హక్కులకు ముప్పు!
మోదీ పాలనలో వ్యవస్థలు సర్వ నాశనం
సమానత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టి పోరాటం
వృత్తి నిపుణులతో ఏఐపీసీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తాం
100 పట్టణ జిల్లాల్లో ప్రొఫెషనల్స్ కమిటీల ఏర్పాటు
న్యాయ, వైద్య రంగాల్లో 100 సహాయ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
పరిపాలనలో పారదర్శకతకు ‘షాడో మినిస్ట్రీ’ అవసరం
ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : మోదీ పాలనలో రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు, పౌర స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయని, రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని రంగాల వృత్తి నిపుణులు ఏకతాటిపైకి రావాలని ఏఐసీసీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ సభ్యత్వంతో సంబంధం లేకుండా నిపుణులంతా తమతో కలిసి పనిచేయాలని కోరారు. ఏఐపీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గాంధీభవన్‌కు వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలతో సమానమని మధుయాష్కీ పేర్కొన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం, పౌరుల స్వేచ్ఛకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలనే ఉద్దేశంతో 2017లో రాహుల్‌గాంధీ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు దాదాభాయ్ నౌరోజీ, మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకులు ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను పెంచడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
వృత్తి నిపుణులతో దేశవ్యాప్త విస్తరణ
న్యాయవాదులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, ఇంజినీర్లు, జర్నలిస్టులు సహా వివిధ రంగాల నిపుణులు ఏఐపీసీలో భాగస్వాములు కావాలని మధుయాష్కీ కోరారు. దేశవ్యాప్తంగా తొలి దశలో 100 పట్టణ జిల్లాల్లో వృత్తి నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణను ఏఐపీసీకి నమూనాగా తీర్చిదిద్ది, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సంస్థను విస్తరిస్తామని వెల్లడించారు. ప్రజలకు గౌరవప్రదమైన జీవితం అందించడంతోపాటు చట్టాల రూపకల్పన, అమలులో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం తమ లక్ష్యమన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన నిపుణులను తీర్చిదిద్దేందుకు మన్మోహన్సింగ్ ఫెలోషిప్ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు మధుయాష్కీ తెలిపారు. తొలి విడతలో ఏడాదిపాటు 50 మందికి శిక్షణ ఇచ్చామని, రెండో విడతకు 800 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ విడతలో 100 మందికి శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు https://manmohansinghfellows.com ద్వారా వివరాలు తెలుసుకొని పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
100 సహాయ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
ప్రజలకు న్యాయ, ఆరోగ్య తదితర రంగాల్లో సహాయం అందించేందుకు ఏఐపీసీ ద్వారా 100 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మధుయాష్కీ వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌తో ప్రత్యక్ష సంబంధం లేని మేధావులు, నిపుణుల సూచనలతో సంక్షేమ పథకాలు, విధానాలను రూపొందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు సంపదను కట్టబెడుతోందని ఆరోపించారు. దేశ నిర్మాణంలో నిపుణుల అనుభవాన్ని, సలహాలను వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించవచ్చన్నారు.
పారదర్శక పాలనకు ‘షాడో మినిస్ట్రీ’
ప్రభుత్వాల పనితీరును స్వతంత్రంగా పరిశీలించి, లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించే వ్యవస్థ అవసరమని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఉన్న తరహాలో ‘షాడో మినిస్ట్రీ’ వ్యవస్థ ఉంటే పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. తెలంగాణలో 22-ఏ జాబితా భూముల విషయంలో కొందరు అధికారులు రెవెన్యూ మంత్రి, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఇలాంటి వ్యవస్థ ఉంటే లోపాలను గుర్తించి, ప్రజలకు ఉపయోగపడే విధానాలను రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవో 118లోని లోపాలను గుర్తించి రెవెన్యూ మంత్రి, అధికారులకు సూచనలు చేశానని, అనంతరం మార్పులతో కొత్త నిబంధనలు పొందుపరిచారని వివరించారు. బ్రిటిష్ పాలకులతో చేతులు కలిపి స్వాతంత్ర్య ఉద్యమాన్ని వ్యతిరేకించిన చరిత్ర బీజేపీ వారసత్వానికి ఉందని మధుయాష్కీ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు మోదీ ప్రభుత్వం తలవంచుతోందని, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించినా కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల సేవలను గుర్తుచేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణ కోసం వృత్తి నిపుణులు ముందుకు వచ్చి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

