పోడు భూముల్లో కందకాల తవ్వకం ఆపాలి!
ఆదివాసీల సాగు భూముల్లో అటవీ శాఖ చర్యలు నిలిపివేయాలి
అర్హులైన గిరిజన రైతులకు హక్కు పత్రాలు అందించాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి
కాకతీయ, ఏటూరునాగారం: గత 25 ఏళ్లుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు లోతైన కందకాలు తవ్వడాన్ని తక్షణమే నిలిపివేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఏటూరునాగారంలో ఎండీ దావూద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూముల్లో కందకాలు తవ్వడం వల్ల ఆదివాసీల జీవనోపాధికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు కోరుతుంటే, మరోవైపు అదే భూముల్లో కందకాలు తవ్వడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో పోడు భూములకు పట్టాలిచ్చేందుకు సర్వేలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన ఆదివాసీ రైతులకు హక్కు పత్రాలు అందించాలని, అటవీ శాఖ చర్యలను నిలిపివేయాలని కోరారు. కందకాల తవ్వకాలు ఆపకపోతే మరో పోడు భూముల పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు సీపీఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బి. రెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి. వెంకటరెడ్డి, రాజేందర్, తోలం కృష్ణయ్య, ప్రభాకర్, నగేష్, చిరంజీవి, లాజర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

