రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత
వరంగల్ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి
కురుమ సామాజిక వర్గం నేతల పిలుపు
పీఏసీఎస్ చైర్మన్ ఎగితే లింగన్నకు ఘన సన్మానం
కాకతీయ, వరంగల్ బ్యూరో: రాజకీయాలకు అతీతంగా కురుమ సామాజిక వర్గమంతా ఐక్యంగా ఉండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం పెంచికలపేటలో కురుమ సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఎగితే లింగన్న కురుమను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, వ్యాపారులు, గ్రాడ్యుయేట్లు, గొర్రెల కాపరులు, మహిళలు, యువతతో పాటు వివిధ రంగాలకు చెందిన వందలాది మంది పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడిగా గుర్తింపు పొందిన దొడ్డి కొమురయ్య కురుమ త్యాగాలను భావితరాలకు గుర్తుండేలా వరంగల్ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అమలు కోసం కృషి చేయాలని నిర్ణయించారు. కురుమ సామాజిక వర్గం విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, పేద కుటుంబాలకు అండగా నిలవడంతోపాటు విద్యార్థులను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించాలని నాయకులు సూచించారు. గ్రామ ఉపసర్పంచ్ చిట్టే రవి కురుమ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగరాజు కురుమ, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను సత్కరించారు. కురుమ నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. హనుమకొండ కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల భరత్‌కుమార్ కురుమ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కంచి ప్రభాకర్ కురుమ, దూడల మల్లన్న, బెల్లం బాలరాజు కురుమ, మంగ రాజన్న కురుమ, రాజా యూత్ సభ్యులు, సంఘం పెద్దలు, ఉద్యోగులు, యువత పాల్గొన్నారు.

