జూకు పోటెత్తిన సందర్శకులు
ఒక్కరోజే 20,483 మంది సందర్శన
రైళ్లు, సఫారీ సేవలకు అదనపు ఏర్పాట్లు
సందర్శకుల రద్దీకి అనుగుణంగా అధికారుల చర్యలు
కాకతీయ, హైదరాబాద్: దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 20,483 మంది జంతుప్రదర్శనశాలను సందర్శించగా, ప్రస్తుత సెలవుల సీజన్లో ఇదే అత్యధిక సంఖ్యగా నమోదైంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జూ ప్రాంగణంలో సందడి నెలకొంది. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు భద్రతా సిబ్బందిని పెంచారు. ప్రవేశ ద్వారాలు, జంతువుల ఎన్క్లోజర్ల పరిసరాల్లో పర్యవేక్షణను ముమ్మరం చేశారు. సందర్శకులకు మెరుగైన అనుభూతి కల్పించేందుకు జూ ప్రాంగణంలో నడిచే రైళ్ల ట్రిప్పుల సంఖ్యను పెంచారు. సఫారీ సేవలు, బ్యాటరీ వాహనాల నిర్వహణను కూడా విస్తరించారు. ప్రస్తుతం జూలో 2,178 జంతువులు ఉండగా, వీటిలో 498 క్షీరదాలు, 1,352 పక్షులు, 320 సరీసృపాలు, 8 ఉభయచరాలు ఉన్నాయి. ఇటీవల జంషెడ్పూర్ జూతో జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా మాండ్రిల్ కోతులను తీసుకొచ్చి, ఒక జత ఆఫ్రికన్ సింహాలను అక్కడికి పంపించారు. గత ఏడాది జామ్‌నగర్‌లోని రాధాకృష్ణ ట్రస్ట్ నుంచి మూడు జీబ్రాలను తీసుకొచ్చారు. దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత జూలో జీబ్రాలు చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా వంతారా కేంద్రం నుంచి కంగారూలను తీసుకొచ్చే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

