34 నెలల్లో 12.40 లక్షల పాస్‌బుక్కులు!
భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యం
రీ-సర్వేతో సాగుదారులకు చట్టబద్ధమైన హక్కులు
భూభారతితో ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం: మంత్రి పొంగులేటి
కాకతీయ, హైదరాబాద్ : ప్రజలకు పారదర్శక రెవెన్యూ సేవలు అందించడంతోపాటు రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు దానిని బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. భూభారతి చట్టం అమలు, పట్టాదారు పాస్బుక్కుల పంపిణీ, భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారంపై చర్చించారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు 5,68,858 పాస్‌బుక్కులు జారీ చేసినట్లు తెలిపారు. అంతకుముందు 6,71,508 పాస్‌బుక్కులు అందించామని, మొత్తంగా 34 నెలల్లో 12,40,366 పాస్‌బుక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు.
రీ-సర్వేతో హక్కుల కల్పన
దశాబ్దాలుగా భూములు సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో హక్కులు లేక ప్రభుత్వ పథకాలకు దూరమైన రైతులను గుర్తించి, చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తున్నామని పొంగులేటి తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం రీ-సర్వే నిర్వహించి వాస్తవ సాగుదారుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వే ద్వారా గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలను పరిష్కరించి 906 మంది రైతులకు 1,600 ఎకరాలకు పైగా భూమిపై హక్కులు కల్పించినట్లు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాల్లో 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. పాస్బుక్కుల ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని ముల్కాపల్లి మండలంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట, దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలాల్లో రీ-సర్వే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. అక్కడి భూ సమస్యలను పరిష్కరించి త్వరలోనే హక్కుదారులకు పాస్‌బుక్కులు అందిస్తామని చెప్పారు. ఇదే విధానాన్ని ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేసి భూమిపై హక్కుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు మేలు జరిగేలా చర్యలు
ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు, ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలైనప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పొంగులేటి స్పష్టం చేశారు. జనగామ జిల్లాలో ఫుడ్ పార్క్ ఏర్పాటుపైనా ఆ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.

