తాగునీరు, విద్యుత్‌పై సర్కారు అలర్ట్!
జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి
నవంబర్ 1 నుంచి నిర్మాణాలకు శుద్ధి చేసిన నీరు
పాలేరు రిజర్వాయర్‌లో 4 టీఎంసీలు కావాలి.. ప్రస్తుతం 2 టీఎంసీలే!
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
కాకతీయ, హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా జిల్లా, మండల స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రాష్ట్రస్థాయిలో వివిధ శాఖలు సిద్ధం చేసిన ప్రణాళికలతోపాటు క్షేత్రస్థాయిలోనూ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోయినా వ్యవసాయ, గృహ అవసరాలకు సరఫరా చేస్తున్నామని సీఎస్ తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించడం లేదని, యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పగటిపూట ఏసీలను 25 డిగ్రీల వద్ద మాత్రమే వినియోగించాలని, సాయంత్రం 6 గంటల తర్వాత వాటి వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేకంగా నియమించిన ఐదుగురు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులపై త్వరలో అఖిలపక్ష సమావేశం, కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అక్రమ మోటార్లతో ట్రాన్స్‌ఫార్మర్లకు ముప్పు
వ్యవసాయ అవసరాల కోసం స్థానిక నీటి వనరుల నుంచి ప్రత్యేక మోటార్లతో అక్రమంగా నీటిని తోడుతుండటంతో విద్యుత్‌పై అధిక భారం పడుతోందని, ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. మంజీరా, సింగూరు నుంచి నీటి సరఫరా అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ జలాశయాల నుంచి సాధారణంగా వచ్చే 110 ఎంజీడీల నీటికి బదులుగా మిషన్ భగీరథ ద్వారా 60 ఎంజీడీలు, కృష్ణా సహా ఇతర వనరుల నుంచి నీటిని సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలకే నిబంధనల ప్రకారం కొత్త బోరుబావుల తవ్వకాలకు అనుమతించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. నిర్మాణాలు, ఇతర పనుల కోసం కొత్త బోరుబావులకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే ఉన్న బోరుబావులను మరింత లోతుగా తవ్వేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, హైడ్రా తదితర సంస్థలతో కలిసి అక్రమ మోటార్లను తొలగిస్తున్నామని వివరించారు. నవంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో నిర్మాణ పనులకు మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసిన నీటిని గ్రీన్ ట్యాంకర్లతో సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలవారీగా ముందస్తు చర్యలు
రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ తెలిపారు. నల్గొండలో ఉపాధి హామీ పనులను ముమ్మరం చేస్తున్నట్లు ప్రత్యేక కార్యదర్శి హరిచందన చెప్పారు. కరీంనగర్ జిల్లాలో వచ్చే జూన్ వరకు తాగునీటి సమస్య ఉండదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీడీ ఎక్కా తెలిపారు. ఆదిలాబాద్‌లో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లు కార్యదర్శి ఇలంబర్తి వెల్లడించారు. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు జూన్ వరకు తాగునీరు అందించాలంటే పాలేరు రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీరు అవసరమని, ప్రస్తుతం 2 టీఎంసీలే ఉన్నాయని ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, మున్సిపల్ శాఖ కార్యదర్శి టీ.కే. శ్రీదేవి, విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు వరుణ్‌రెడ్డి, జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

