జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ.. సిట్‌తో విచారణ జరపాలి!
రేవంత్ పాలనలో పోలీసులే గుండాలుగా ప్రవర్తిస్తున్నారు
ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయరా?
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ నేత డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
కాకతీయ, సిరిసిల్ల : జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై సిట్ ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో పోలీసులే గుండాలుగా వ్యవహరిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బాధిత జర్నలిస్టులను పరామర్శించిన ఆయన, వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. గంభీరావుపేట మండలంలో భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకున్న అంశంపై ఏక్ ధమ్ న్యూస్ రిపోర్టర్లు కథనాలు ప్రచురించడంతో వారిపై అక్రమ కేసులు నమోదు చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గంభీరావుపేట ఎస్సై ఇద్దరు జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గాయాలతోపాటు చేయి విరిగి బాధితులు భయాందోళనలకు గురయ్యారని తెలిపారు. జర్నలిస్టులు కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నేరం చేయకపోయినా కేసులు నమోదు చేసి, ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్టులు చేసే పోలీసులు.. బాధితులుగా మారిన జర్నలిస్టులు ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సామాన్యులకు ఒక న్యాయమా?
సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరో న్యాయమా? ఇదేనా ప్రజాపాలన? అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. డీజీపీ సీవీ ఆనంద్ ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు న్యాయస్థానాలు నిర్దేశించిన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ పోలీసులు వాటిని పట్టించుకోకుండా జర్నలిస్టుల పట్ల కర్కశంగా వ్యవహరించారని విమర్శించారు. జర్నలిస్టులపై దాడి చేయాలని ఎస్సైకి ఎవరు ఆదేశాలిచ్చారో తేల్చాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. విచారణ నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలని, అవసరమైతే కేసును సీఐడీకి అప్పగించాలని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జర్నలిస్టులకు అండగా బీఆర్ఎస్
ఏక్ ధమ్ న్యూస్ రిపోర్టర్లు పదేళ్లుగా వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఫర్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా గుర్తింపు పొందిన పత్రికకు చెందిన జర్నలిస్టులపై దాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో పోలీసుల చేతిలో కర్ల రాజేశ్ హత్యకు గురయ్యారని, ఇప్పుడు సిరిసిల్లలో మరో దళిత జర్నలిస్టుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. దాడిలో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు.

