లక్నవరం చెరువులో నీళ్లు నిల్
నీరు లేక బోసిపోయిన చెరువు
కాకతీయ, గోవిందరావుపేట: పర్యాటక ప్రాంతంగా పేరొందిన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు నీళ్లు లేక బోసిపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు పంటలకు సాగునీరు అందించే చెరువులో ప్రస్తుతం నీరు లేకపోవడంతో దాని కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు మోటార్లతో నీటిని తోడిపోస్తున్నా ఎండల తీవ్రతకు భూమిలో తడి నిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ కోతలు వారి కష్టాలను మరింత పెంచుతున్నాయి. మూడు ఎకరాల్లో పంట సాగు చేసినా కనీసం ఒక్క ఎకరాన్ని కాపాడుకోవడం కూడా కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. పంటల కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని కన్నీటిపర్యంతమవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. లక్నవరం చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో సాగునీటిపై ఆధారపడిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

