సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!
ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన
రూ.8 లక్షల కోట్ల అప్పుల వడ్డీ భారంపైనా చర్చ
ఏఐపీసీ బలోపేతానికి సహకరిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్ మధుయాష్కీగౌడ్ చర్చించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీఐలో మధుయాష్కీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐపీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు గంటన్నరపాటు సమావేశమై రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమాలోచనలు జరిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్ వంటి పథకాల అమలు తీరును ప్రజలకు వివరించాల్సిన అవసరంపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు, స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనతోపాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణం ద్వారా కొత్త కంపెనీలు, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి త్వరలో మూడేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని వివరించడంతోపాటు సంక్షేమ పథకాల అమలుపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని చర్చించినట్లు సమాచారం. వివిధ సంస్థల పనితీరును సమీక్షించి ప్రగతి నివేదికలు తీసుకుంటున్న తరహాలోనే ప్రభుత్వ శాఖలు, పథకాల అమలుపైనా నివేదికలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా చర్చ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఫీజు రీయింబర్స్‌మెంట్, గత ప్రభుత్వ హయాంలో చేసినట్లు పేర్కొన్న సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులపై వడ్డీ భారం వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న తీరును వివరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఏఐపీసీని బలోపేతం చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై సమర్థవంతమైన చర్చలు నిర్వహించేలా ఏఐపీసీని తీర్చిదిద్దడంపై చర్చించారు. నిపుణుల సూచనలు, నివేదికలను వినియోగించుకుని కొత్త విధానాల రూపకల్పనలో వారి సేవలను సద్వినియోగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని రేవంత్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్ అభిప్రాయపడ్డారు.

