పెద్ది ఆశయ సాధనకు కదలాలి!
పట్టభద్రుల ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే ఎన్నిక ఇదే
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పిలుపు
కాకతీయ, నర్సంపేట టౌన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించే ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. గురువారం చెన్నారావుపేట, నర్సంపేట రూరల్, ఖానాపూర్ మండలాల బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే, ఓరుగల్లు ఉద్యమ నాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పించిన పోచంపల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఆయన లేకుండా నర్సంపేటలో జరుగుతున్న తొలి సమావేశమిదని, ఈ లోటు తీరనిదని అన్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్నది పెద్ది చివరి కోరికగా గుర్తుచేస్తూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని పోచంపల్లి విమర్శించారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు పురోగతిని సమీక్షించి, గ్రామాల వారీగా అర్హులందరినీ నమోదు చేయించాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఓటరు నమోదు ఇన్చార్జులు, యువజన, మహిళా నాయకులు పాల్గొన్నారు.

