రహదారి భద్రత, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి!
గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిబంధనల మేరకే బాణసంచా దుకాణాలకు అనుమతులు
అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్ జి ఆదేశం
కాకతీయ, ములుగు: రహదారి ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్. మహేందర్ జి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టాలని, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టడంతో పాటు హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై ప్రచారం చేయాలన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడంపై నిఘా పెట్టాలని ఆదేశించారు. దీపావళి బాణసంచా దుకాణాలకు సంబంధిత శాఖల నిరభ్యంతర ధ్రువపత్రాలు పొందిన వారికే తాత్కాలిక లైసెన్సులు ఇవ్వాలని స్పష్టం చేశారు. అగ్నిమాపక పరికరాలు, నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని, భద్రతా నిబంధనలపై నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ రవీందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

