జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు!
రామప్ప ఐలాండ్ అభివృద్ధికి రూ.13 కోట్లు
గ్రామాల్లో పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలి: మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు: ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. జంగాలపల్లి గుట్టను దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ టేబుల్ మౌంటెన్ తరహాలో అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్‌వో వికాస్ మీనాతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. జంగాలపల్లి గుట్టపై నుంచి లక్నవరం, రామప్ప అందాలను వీక్షించేలా వ్యూ పాయింట్‌ను తీర్చిదిద్దేందుకు నిపుణులతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలోని గుహలు, గుట్టలు, కోటలు, పురాతన ఆలయాలను పరిరక్షిస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామాల్లో మంజూరైన పనుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పనుల ఫొటోలను అప్లోడ్ చేస్తే పూర్తయినవి, పెండింగ్‌లో ఉన్నవి ఉన్నతాధికారులు పరిశీలించవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం కింద 375 రకాల పనులు చేపట్టవచ్చని, ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డు ఇచ్చి పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. బీటీ రహదారుల నిర్మాణానికి రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అటవీ అనుమతులతో నిలిచిన రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్ జి, సంపత్‌రావు, టూరిజం నోడల్ అధికారి ధర్మనాయక్, డీఆర్డీవో రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

