కేశవపట్నంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
72 వాహనాలు సీజ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హుజూరాబాద్ ఏసీపీ మాధవి
కాకతీయ,శంకరపట్నం:కేశవపట్నం గ్రామంలో హుజూరాబాద్ సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు రెండు ప్రత్యేక స్ట్రైకింగ్ టీమ్స్ పాల్గొన్నాయి.
గ్రామంలోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి అనుమానిత వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని మొత్తం 72 వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 65 ద్విచక్ర వాహనాలు, 4 త్రిచక్ర వాహనాలు, 3 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితో ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడంతో పాటు నేరాల నివారణకు అవకాశం ఉంటుందన్నారు.
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, నూతన బైపాస్ రోడ్డుపై నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలని కోరారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

