మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన
కాకతీయ,శంకరపట్నం:మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు అందించడంతో పాటు కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని కోరారు. 317 జీవోను అమలు చేయాలని, టీజీటీలకు నేషనల్ ఇంక్రిమెంట్లు వర్తింపజేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని, నిరసన కార్యక్రమాల్లో బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు ఉద్యమాన్ని విస్తరించి సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె. ప్రభాకర్, టీజీ టీమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. మహేందర్ కట్కూరి, బొల్లం రాజు, సతీష్ కుమార్, శివశంకర్, మధుకర్, శంకర్, నరేష్, వాసుదేవ్, నాగమణి, ఆర్. రజిత, ఫర్హీన, ఎస్. రజిత, వనజ, రాధాదేవి, సంధ్య, అనిత, స్వప్న, స్రవంతితో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కంప్యూటర్ రాజు, సుజాత పాల్గొన్నారు.

