డబ్బులొస్తలేవని కుంగిపోయాడు… ప్రాణాలు విడిచాడు!
– రాయపర్తి మండలం తిరుమలాయపల్లిలో తీవ్ర విషాదం
– అప్పు చెల్లించలేదని మనోవేదనకు గురై బ్రెయిన్ స్ట్రోక్ తో ముత్తయ్య మృతి
– మాజీ సర్పంచ్ గజవెల్లి అనంత ప్రసాద్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
కాకతీయ,రాయపర్తి : అవసరానికి ఆదుకుంటే ఆపదలో ముంచాడు. కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే ఇష్టా రీతిన ప్రవర్తించాడు.చివరికి ఇచ్చిన డబ్బులు తిరిగి రావనే మనోవేదనకు గురై బ్రెయిన్ స్ట్రోక్ తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనతో తిర్మమలాయపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గ్రామస్తులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన ముద్ర బోయిన ముత్తయ్య(75)వద్ద అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గజవెల్లి అనంత ప్రసాద్ ఆరేళ్ల క్రితం రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.కొంతకాలం తర్వాత ముత్తయ్యకు అత్యవసరమై డబ్బులు కావలసి వచ్చి,తన డబ్బులు తనకు ఇవ్వాలని ప్రసాద్ ను కోరాడు.ఈ క్రమంలో ప్రసాద్ డబ్బులు చెల్లించకుండా రోజులు తిప్పుతూ కాలయాపన చేయడం మొదలుపెట్టాడని అన్నారు.పలుమార్లు బ్రతిమలాడిన,నిలదీసినా ప్రసాద్ నుంచి సరైన సమాధానం రాలేదు.దింతో తను ఎంతో నమ్మకంతో ఇచ్చిన రూ. 2లక్షల అప్పు ఇక తిరిగి ఆదేమోనని ముత్తయ్య తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడని పేర్కొన్నారు.కూడబెట్టిన సొమ్ము చేజారిపోయిందని బాధ,ఆర్థిక ఇబ్బందులు ఆయనను లోలోపల కొంగదీశాయి.ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడితో ముత్తయ్యకు వారం రోజుల క్రితం బీపి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా…చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ముత్తయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.అదే రోజు రాత్రి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు,బంధువులు గ్రామానికి తరలించి బాధ్యుడైన ప్రసాద్ ఇంటి ఎదుట ముత్తయ్య మృతదేహంతో నిరసన చేపట్టారు.తన తండ్రి మరణానికి ప్రసాద్ మోసమే కారణమని కుమారుడు నర్సయ్య ఆరోపించాడు.డబ్బులు ఎగ్గొట్టి తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన ప్రసాద్ ను వెంటనే అరెస్టు చేయాలని,తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆందోళన చేపట్టారు.ఈ నిరసనతో గ్రామంలో తీవ్ర ఉత్రిక వాతావరణం నెలకొంది.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని, బాధితులతో మాట్లాడి శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

