బయట డాక్టర్ల బోర్డులు.. లోపల నకిలీ వైద్యం!
ప్రముఖ వైద్యుల పేర్లతో అర్హతలేని వ్యక్తుల చికిత్సలు
రిజిస్ట్రేషన్ నంబర్లను అడ్డుపెట్టుకుని అక్రమ కార్యకలాపాలు
హనుమకొండలో టీజీఎంసీ తనిఖీల్లో వెలుగుచూసిన వ్యవహారాలు
ఫార్మసీ చదివిన వ్యక్తి వైద్యుడిగా చెలామణి
అనుమతుల్లేని క్లినిక్‌లలో ఇంజెక్షన్ల మోతాదులోనూ అక్రమాలు
నకిలీ వైద్యులపై పోలీస్ కేసులకు టీజీఎంసీ సిద్ధం
కాకతీయ, హనుమకొండ : క్లినిక్ బయట ప్రముఖ వైద్యుల పేర్లు, మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్లు.. లోపల మాత్రం అర్హతలేని వ్యక్తులతో చికిత్సలు! హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న ఈ వ్యవహారాలు తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) తనిఖీల్లో వెలుగుచూశాయి. రెడ్డికాలనీ, రాయపుర, ఇందిరానగర్ ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అనధికారిక క్లినిక్‌లు, అర్హతలేని వ్యక్తుల వైద్య సేవలు, నిబంధనలకు విరుద్ధంగా ఇంజెక్షన్లు ఇస్తున్న వ్యవహారాలను గుర్తించి ఆధారాలు సేకరించారు. సంబంధిత వ్యక్తులపై తెలంగాణ వైద్య వృత్తిదారుల నమోదు చట్టం ప్రకారం హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ ప్రతినిధులు వెల్లడించారు. ఇందిరానగర్‌లోని శ్రీలక్ష్మి ఫార్మసీ వెనుక గదిలో అనుమతులు లేకుండా శ్రీలక్ష్మి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు టీజీఎంసీ బృందం గుర్తించింది. క్లినిక్ బయట డాక్టర్ బి. మోహనకృష్ణ, డాక్టర్ ఎన్. అవినాష్ పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లు ప్రదర్శించగా.. లోపల ఆర్.కె. రావు అనే వ్యక్తి చికిత్సలు అందిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ఆయనకు వైద్య అర్హతలు లేవని, గతంలో హైదరాబాద్‌లో ఓ వైద్యుడి వద్ద కాంపౌండర్‌గా పనిచేసినట్లు విచారణలో వెల్లడైందని కౌన్సిల్ తెలిపింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి లేకుండానే క్లినిక్ నిర్వహించడంతో పాటు పడకలు కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తించింది.

ఫార్మసీ చదివి వైద్యుడిగా చెలామణి
ప్రణతి క్లినిక్‌లో డాక్టర్ కె. సుష్మిత పేరుతో ఉన్న అనుమతి గడువు ముగిసినట్లు తనిఖీల్లో గుర్తించారు. ఫార్మసీ విద్యను అభ్యసించిన ఎన్. సందీప్ వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ చికిత్సలు అందిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. వైద్య అర్హతలు, క్లినిక్ అనుమతుల విషయంలో నిబంధనలు పాటించకపోవడంపై కౌన్సిల్ విచారణ చేపట్టింది. గతంలో కేసులు నమోదైన సిద్ధార్థ క్లినిక్ వ్యవహారంలోనూ విజయ, వేణు నిర్వహిస్తున్న కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తూ స్టెరాయిడ్, నొప్పి నివారణ, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లను అధిక మోతాదులో ఇస్తున్నట్లు గుర్తించినట్లు టీజీఎంసీ వెల్లడించింది. ఈ కేంద్రాల్లో చికిత్సల విధానం, ఉపయోగిస్తున్న మందులు, వైద్య అర్హతలపై మరింత విచారణ జరగాల్సి ఉంది.
హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసులు
ఈ వ్యవహారాలకు సంబంధించి డాక్టర్ కె. సుష్మిత, డాక్టర్ బి. మోహనకృష్ణ, డాక్టర్ ఎన్. అవినాష్‌లకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయనున్నట్లు టీజీఎంసీ తెలిపింది. వారి పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లు క్లినిక్‌ల వద్ద ఎందుకు ప్రదర్శించారు? అక్కడ జరుగుతున్న వైద్య సేవలపై వారికి అవగాహన ఉందా? పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారా? అన్న అంశాలపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సదరు నకిలీ వైద్యులపై తెలంగాణ వైద్య వృత్తిదారుల నమోదు చట్టం ప్రకారం హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ ప్రతినిధులు తెలిపారు. అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తూ, అర్హతలేని వ్యక్తులతో వైద్యం చేయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో టీజీఎంసీ సభ్యుడు డాక్టర్ వి. నరేష్‌కుమార్, కో-ఆప్టెడ్ సభ్యుడు డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ అన్వర్ మియా, ఐఎంఏ వరంగల్ కార్యదర్శి డాక్టర్ ఎస్. శిరీష్‌కుమార్ పాల్గొన్నారు.

