కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచరణ
నవంబర్ రెండో వారంలో పనులకు శ్రీకారం
2027 వానాకాలం నాటికి మరమ్మతులు పూర్తి చేసేలా కసరత్తు
అక్టోబర్ 5న సాంకేతిక నివేదికలు సమర్పణ
ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకే పునరుద్ధరణ
నాణ్యత, భద్రత విషయంలో రాజీ ఉండదు
నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ధరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిపుణుల సూచనలు, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని నిర్ణయించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమీక్షలో వెల్లడించారు. దెబ్బతిన్న నిర్మాణాలపై నిర్వహిస్తున్న సాంకేతిక పరీక్షలు, అధ్యయనాల ఆధారంగా మరమ్మతుల విధానాన్ని ఖరారు చేయనున్నారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా సమగ్రంగా పరిశీలించి పనులు చేపట్టనున్నారు.
అక్టోబర్ 5న సాంకేతిక నివేదిక
కేంద్ర జల సంఘం సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి అక్టోబర్ 5న పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లు, సాంకేతిక వివరాలు సమర్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కేంద్ర సంస్థల సూచనలు, అవసరమైన అనుమతులు వచ్చిన అనంతరం పనులను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే మేడిగడ్డలో భౌగోళిక, భూసాంకేతిక పరీక్షలు, నమూనాల సేకరణ కొనసాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2027 వానాకాలం ప్రారంభానికి ముందే మూడు బ్యారేజీల మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పనుల్లో నాణ్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలకు అనుగుణంగానే పునరుద్ధరణ చేపట్టాలని స్పష్టం చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బ్యారేజీలను పటిష్ఠంగా పునరుద్ధరించడంతోపాటు భవిష్యత్‌లో భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణలో సాంకేతిక నిపుణులు, కేంద్ర సంస్థలు, నీటిపారుదల శాఖ సమన్వయంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు.

