ఏజెన్సీకి న్యాయ సేవలు విస్తరించాలి
ఏటూరునాగారంలో అదనపు జేఎఫ్సీఎం కోర్టు ఏర్పాటు చేయాలంటున్న జిల్లా వాసులు
కాకతీయ,ఏటూరునాగారం రూరల్: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన కార్యక్రమాలు, ఇతర సేవలు ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరడం లేదని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని పది మండలాలకు న్యాయ సేవలు సమానంగా అందాల్సి ఉన్నప్పటికీ ఏటూరునాగారం పరిసర ఏజెన్సీ మండలాల్లో మాత్రం జిల్లా న్యాయ సేవా సంస్థ సేవలు పరిమితంగానే అందుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఒక్కసారి మాత్రమే న్యాయ సేవలు అందినట్లు చెబుతున్నారు. దీంతో ఉచిత న్యాయ సహాయం అవసరమైన గిరిజనులు, పేదలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాకు నూతనంగా మంజూరైన అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టును ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏటూరునాగారంలో కోర్టు అందుబాటులోకి వస్తే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయ వ్యవస్థ చేరువ కావడంతో పాటు జిల్లా న్యాయ సేవా సంస్థ సేవలు కూడా విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు తదితర మారుమూల ప్రాంతాల ప్రజలు న్యాయ సేవల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితిని నివారించాలని కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సత్వర న్యాయం, ఉచిత న్యాయ సహాయం అందేలా ఏటూరునాగారంలో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కోర్టును ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో న్యాయ సేవల విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టి మారుమూల ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేయాలని కోరుతున్నారు.

