సుందరగిరి గడ్డపై జానపద జాతర!
– కనుకవ్వ బతుకమ్మ పాట 2026
– కోలాహలంగా ‘కనకవ్వ’ బతుకమ్మ పాట చిత్రీకరణ
– గాయని కనకవ్వ, ‘జబర్దస్త్’ యోధ సందడితో గ్రామంలో పండుగ వాతావరణం
కాకతీయ ,చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామం బుధవారం పండుగ శోభతో పరవశించిపోయింది. ప్రముఖ తెలంగాణ జానపద గాయని కనకవ్వ గ్రామానికి విచ్చేయడంతో ఊరంతా ఉత్సాహభరితంగా మారింది. రాబోయే పండుగను పురస్కరించుకుని రూపొందిస్తున్న శ్రీ ఫిల్మ్ మ్యూజిక్ ప్రెజెంటేషన్ లో ‘బతుకమ్మ 2026’ ప్రత్యేక జానపద గీతం వీడియో చిత్రీకరణ సుందరగిరిలోని ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ పాటలో కనుకవ్వకు తోడుగా ‘జబర్దస్త్’ ఫేమ్ నటి యోధ నటించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా సాగిన ఈ చిత్రీకరణలో గ్రామ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడారు. కనకవ్వ, యోధల సందడితో గ్రామంలో ముందస్తు పండుగ సంబరాలు అంబరాన్నంటాయి.

కళాకారులకు ఘన స్వాగతం
గ్రామానికి విచ్చేసిన కళాకారులకు సర్పంచ్ జంగ శిరీష రమణారెడ్డి, గ్రామ ప్రజల తరఫున ఘనంగా స్వాగతం పలికారు. షూటింగ్ నిర్విఘ్నంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పంచాయతీ తరఫున సమకూర్చారు. సుందరగిరి వంటి గ్రామంలో ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ షూటింగ్ జరగడం ఊరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని, గ్రామ ప్రతిష్టను పెంచిందని ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. కనకవ్వను, చిత్రీకరణను ప్రత్యక్షంగా తిలకించేందుకు గ్రామస్థులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అలరించనున్న బతుకమ్మ పాట
‘శ్రీ ఫిల్మ్ మ్యూజిక్’ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ పాటను బాషం పోచవ్వ, ఎ. నాగేశ్వరమ్మ నిర్మించగా, ఎ. అశోక్ సహ నిర్మాతగా వ్యవహరించారు. దర్శకత్వం, ఛాయాగ్రహణం (డిఓపి), కూర్పు (ఎడిటింగ్) బాధ్యతలను అరుణ్ కొలుగూరి నిర్వహించారు. పాలోజీ గంగాచారి సాహిత్యం అందించగా, వెంకట్ అజ్మీర్ సంగీతాన్ని సమకూర్చారు. సన్ని గణేష్ నృత్య దర్శకత్వం వహించారు.అంజి,చిరంజివి,రవి నటించారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి,ఉపసర్పంచ్ మేడబోయిన రాజు,రిటైర్ టీచర్ చికోటి రమణయ్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు,సహకారం అందించిన గ్రామస్థులు ఆవుల శ్రీనివాస్, బొల్లబత్తిని మహెష్, బరిగెల మహేందర్, రెడ్డి శ్రీనివాస్, నల్లగొని సురేష్,మాహిళ సంఘం విఒఎ లు ఎనగందుల లత,తాళ్ళపల్లి వసంత తదితరులు ఉన్నారు.

