పంచాయితీకి పిలిచి దాడి…
మాజీ కార్పొరేటర్ భర్త మరో ఇద్దరు కలిసి దాడి చేశారంటూ ఆరోపణలు
కాకతీయ, గీసుగొండ: పంచాయితీ ఉందని ఇంటికి పిలిచి మాజీ కార్పొరేటర్ భర్త మరో ఇద్దరితో కలిసి తనపై దాడి చేసి, లక్ష రూపాయల నగదును లాక్కొని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ధర్మారం గ్రామానికి చెందిన చీర్ల ఉమారెడ్డి గీసుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన మాజీ కార్పొరేటర్ సుంకరి మనీషా భర్త సుంకరి శివ పంచాయితీ ఉందని చెప్పి తనను ఇంటికి పిలిపించారని తెలిపారు. అక్కడికి వెళ్లిన సమయంలో తన వద్ద ఉన్న రూ.లక్ష నగదును సుంకరి శివ,చీర్ల రాజు,చీర్ల మల్లా రెడ్డి కలిసి లాక్కున్నారని ఆరోపించారు. అనంతరం ముగ్గురూ తనపై దాడి చేసి దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని, వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ సుంకరి శివ, చీర్ల మల్లారెడ్డి తనను బెదిరించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఉమారెడ్డి తెలిపారు. ఇప్పటికైనా తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గీసుగొండ సీఐని కోరారు.


