రాష్ట్రస్థాయి క్రీడలకు ఇనుగుర్తి విద్యార్థులు
టెన్నిస్, గట్కా పోటీలకు ఐదుగురి ఎంపిక
ఉమ్మడి వరంగల్ జిల్లా పోటీల్లో ప్రతిభ
ఇనుగుర్తి జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం అమ్మ యాకయ్య
కాకతీయ, ఇనుగుర్తి : రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఇనుగుర్తి జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని పాఠశాల హెచ్‌ఎం అమ్మ యాకయ్య అన్నారు. శుక్రవారం ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో భాగంగా ఇటీవల జేఎన్‌ఎస్ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపిక పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. టెన్నిస్ అండర్-17 విభాగంలో సంగేమ్ రాజు, మోరపోజు చైతన్య రిషి, అండర్-14 విభాగంలో పార్నంది హర్షవర్ధన్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గట్కా అండర్-17 విభాగంలో జాటోత్ అజయ్, సాత్విక్ ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ఇందిరా పార్క్‌లో అండర్-14 టెన్నిస్ పోటీలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గట్కా పోటీలు జరగనున్నాయి. అండర్-17 టెన్నిస్ పోటీలు ఈ నెల 13 నుంచి 15 వరకు హనుమకొండలోని జేఎన్‌ఎస్ టెన్నిస్ కోర్టులో నిర్వహించనున్నారు. విద్యార్థులను హెచ్‌ఎం అమ్మ యాకయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

