అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు
ఈ నెల 27, 28, 29 తేదీల్లో పంపిణీ
15వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, హైదరాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులందరికీ ఉచిత సహాయ పరికరాలు అందించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, 27, 28, 29 తేదీల్లో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఏడిప్ పథకం కింద పరికరాలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వీల్చైర్లు, వినికిడి పరికరాలు, ట్రైసైకిళ్లు, నడక కర్రలు, కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలను అర్హులకు అందించనున్నట్లు తెలిపారు. 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న అర్హులకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తల సమన్వయంతో అర్హులను గుర్తించి, దండోరా ద్వారా పథకంపై ప్రచారం చేయాలని సూచించారు. యూడీఐడీ కార్డు లేదా సదరం ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, దివ్యాంగుల పింఛన్ కార్డు తదితర పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మూడు జిల్లాల్లో పంపిణీ కేంద్రాలు
హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల వారికి హుస్నాబాద్‌లో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల వారికి ముల్కనూరులో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల వారికి అందుబాటులో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. లబ్ధిదారులను ప్రత్యేక బస్సుల్లో తరలించడంతో పాటు భోజన, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, మూడు జిల్లాల అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ డిజేబిలిటీ రాంగోపాల్‌రెడ్డి, ఈడీపీ జాయింట్ మేనేజర్ రవిశంకర్, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

