జూడోలో.. కరీంనగర్ ఛాంపియన్
రన్నరప్గా వరంగల్ జిల్లా
ఢిల్లీ జాతీయ పోటీల్లో పతకాలు సాధించాలి
రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కైలాసం యాదవ్ పిలుపు
కాకతీయ, వరంగల్ : రాష్ట్రస్థాయి అండర్–14 బాలబాలికల జూడో పోటీల్లో కరీంనగర్ జిల్లా ఓవరాల్ ఛాంపియన్గా నిలవగా, వరంగల్ జిల్లా రన్నరప్గా నిలిచింది. 70వ తెలంగాణ రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని కొత్తవాడ కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన పోటీలు మంగళవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కైలాసం యాదవ్ విజేతలను అభినందించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమికి నిరుత్సాహపడకుండా పట్టుదలతో సాధన కొనసాగించాలని క్రీడాకారులకు సూచించారు. జూడో ఆత్మరక్షణతోపాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రీడల్లో తగిన శిక్షణ, ప్రోత్సాహం అందించాలని అన్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి జూడో పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి వాసుదేవరావు, రాష్ట్ర జూడో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి దుపాకి సంతోష్ కుమార్, హనుమకొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఏ. ప్రభాకర్ రెడ్డి, న్యాయ నిర్ణేతలు, వివిధ జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులు, జూడో కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.


