గోదావరి జలాలపై కుట్ర..
తెలంగాణ హక్కులకు మరణశాసనం!
గోదావరి–కావేరీ లింకు పేరుతో రాష్ట్రానికి తీరని నష్టం
పోలవరం నుంచి బొల్లపల్లి మీదుగా నీళ్ల తరలింపునకు చంద్రబాబు యత్నం
తెలంగాణ వాటా తేల్చకుండా అనుసంధానం ఎలా చేస్తారు?
పంపులు నడపకుండా కరువు తెచ్చారు.. రైతులను ఆదుకోవడంలో విఫలం
ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పేరుతో తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. పోలవరం నుంచి బొల్లపల్లి మీదుగా నీటిని తరలించే ప్రతిపాదనతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశంపై మౌనంగా ఉండటం సరికాదన్నారు.శనివారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ నవంబర్ 3న ఢిల్లీలో జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశం ఎజెండాలో గోదావరి–కావేరీ అనుసంధానాన్ని చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా, పెండింగ్ ప్రాజెక్టుల ప్రయోజనాలు తేల్చకుండా ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లకూడదని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 7న గోదావరి–కావేరీ అనుసంధానంపై లేఖ రాశారని హరీశ్‌రావు తెలిపారు. ఆ లేఖలోని ప్రతిపాదనల మేరకు అంశాన్ని సమావేశం ఎజెండాలో చేర్చారని విమర్శించారు. తొలుత పోలవరం–బనకచర్ల లింకు ప్రాజెక్టు పేరుతో గోదావరి జలాలను తరలించే ప్రయత్నం జరిగిందని, ఆ తర్వాత నల్లమలసాగర్ ప్రతిపాదన తెరపైకి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పేరుతో పోలవరం నుంచి బొల్లపల్లి, నాగార్జునసాగర్, సోమశిల మీదుగా నీటిని తరలించే ప్రతిపాదన ముందుకు తెచ్చారని ఆరోపించారు. గోదావరి జలాల తరలింపునకు సంబంధించి ప్రతిపాదనల పేర్లు మారుతున్నా, తెలంగాణ ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. గతంలో ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదన ఉందని, ఇప్పుడు ఆ మార్గాన్ని పక్కనపెట్టి పోలవరం నుంచి బొల్లపల్లి మీదుగా తీసుకెళ్లాలని చూస్తున్నారని పేర్కొన్నారు. బొల్లపల్లి రిజర్వాయర్‌లో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే ప్రతిపాదన ఉందని, దీనివల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వాటా తేల్చాకే అనుసంధానం
గోదావరి–కావేరీ లింకులో తెలంగాణకు న్యాయమైన వాటా కల్పించాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి 968 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి ఇవ్వాలని, అనుసంధానం ద్వారా తరలించే నీటిలో 50 శాతం తెలంగాణకు కేటాయించాలని గతంలోనే కోరినట్లు తెలిపారు. తెలంగాణ నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడం సమంజసం కాదన్నారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదన ప్రకారం ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీల నీటిని గోదావరి–కావేరీ అనుసంధానానికి వినియోగించాలనే ఆలోచన ఉందని వివరించారు. ఈ నీటిలో తెలంగాణకు 43 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 44 టీఎంసీలు, తమిళనాడుకు 42.5 టీఎంసీలు, పుదుచ్చేరికి 2.5 టీఎంసీలు, కర్ణాటకకు 16 టీఎంసీలు కేటాయించే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. ఈ కేటాయింపులు, తెలంగాణ అవసరాలపై స్పష్టత ఇవ్వకుండా ప్రాజెక్టు మార్గాన్ని మార్చడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని విమర్శించారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ మీదుగా అనుసంధానం జరిగితే తెలంగాణకు నీటి ప్రయోజనాలు ఉంటాయని హరీశ్‌రావు అన్నారు. కరువు పరిస్థితుల్లో ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 2,38,236 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశం గతంలో కేంద్రం కుదుర్చుకున్న అవగాహనలోనూ ఉందని పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్గాన్ని మార్చితే తెలంగాణ పరిశ్రమలకు, తాగునీటికి, సాగునీటికి ఎలాంటి భరోసా ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రయోజనం కలిగించే ఇచ్చంపల్లి, సమ్మక్కసాగర్ మార్గాలను పక్కనపెట్టడం వెనుక కారణమేంటని నిలదీశారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ గతంలో లేఖ రాసిందని, సమ్మక్కసాగర్‌కు 45 టీఎంసీల అనుమతిపై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణకు నష్టం కలిగించేలా మార్గాన్ని మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.
పెండింగ్ ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం
తెలంగాణలో ఇంకా 139 టీఎంసీల నీటి వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. వార్దా, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు సాధించడంలో విఫలమవుతున్న ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలకు నీటిని తరలించే ప్రతిపాదనలపై ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. గోదావరి–కావేరీ అనుసంధానం జాతీయ ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు అని చెబుతున్నారని, అయితే ఒక రాష్ట్రానికి నష్టం కలిగించే ప్రతిపాదనను జాతీయ ప్రయోజనంగా ఎలా పరిగణిస్తారని నిలదీశారు. తెలంగాణకు కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా స్పందన లేదని విమర్శించారు. తెలంగాణకు కూడా జాతీయ ప్రాజెక్టుల విషయంలో సమాన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పంపులు నడపకుండా కరువు తెచ్చారు
రాష్ట్రంలో సాగునీటి సమస్యలపై కూడా హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. దేవాదుల ప్రాజెక్టులో పది మోటార్లు నడపాల్సిన చోట మూడే ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు. కన్నెపల్లి, కల్వకుర్తి పంపుల విషయంలోనూ పూర్తిస్థాయిలో నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. శ్రీశైలంలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోలేదని విమర్శించారు. దేవాదులలో పది మోటార్లను నడిపి ఉంటే చెరువులు, చెక్‌డ్యామ్‌లు, రిజర్వాయర్లు నిండేవని, వరంగల్ ప్రాంతంలో సాగునీటి ఇబ్బందులు తగ్గేవని పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా 35 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ 13 టీఎంసీలకే పరిమితమయ్యారని ఆరోపించారు. కన్నెపల్లిలో పంపులు నడిపితే తెలంగాణకు, హైదరాబాద్‌కు నీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుల విషయంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థను సాకుగా చూపి కాలయాపన చేశారని హరీశ్‌రావు అన్నారు. అయితే నీటిని ఎత్తిపోవాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ హైకోర్టులో అఫిడవిట్ వేసినట్లు పేర్కొన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ నివేదికలో సానుకూల అంశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం నమోదైనా అక్కడ పంటల సాగుకు ఆంక్షలు విధించలేదని, తెలంగాణలో మాత్రం పంటలు వేయొద్దని చెబుతున్నారని విమర్శించారు. అక్కడ జలహారతి ఉంటే తెలంగాణలో కన్నీళ్ల హారతి పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన పరిస్థితి అని ఆరోపించారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
గోదావరి జలాల తరలింపుపై చంద్రబాబు వరుసగా లేఖలు రాస్తూ, ఢిల్లీలో సమావేశాల్లో పాల్గొంటున్నారని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలకే ప్రాధాన్యం ఇవ్వకుండా తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించాలని కోరారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకను ఒప్పించేందుకు గోదావరి జలాల వినియోగంతోపాటు ఆల్మట్టి వద్ద 16 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే ప్రతిపాదనను చంద్రబాబు ముందుకు తెచ్చారని హరీశ్‌రావు ఆరోపించారు. పోలవరం ద్వారా 21 టీఎంసీల నీటి మళ్లింపు ప్రతిపాదనతోపాటు మరో 16 టీఎంసీలను నిల్వ చేసుకునే అంశం అమలైతే పాలమూరు ప్రాంతానికి నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. నీటి సమస్యలు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం కావాలని సూచించారు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ఎలాంటి ద్వేషం లేదని, అయితే రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోబోమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. గోదావరి–కావేరీ అనుసంధాన ప్రతిపాదనలను పునఃపరిశీలించి, తెలంగాణ వాటా, పెండింగ్ ప్రాజెక్టుల ప్రయోజనాలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ప్రజల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

