ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హనుమకొండ: వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆకాంక్షించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రార్థించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని అమ్మవారిని వేడుకున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనకు పార్టీ నాయకత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని, ధర్మం, న్యాయం, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తాయని ఈ పండుగ చాటిచెబుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, యువత, మహిళలు, వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజలంతా పరస్పర ప్రేమాభిమానాలతో, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ 1వ డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, నాయకులు రవి, రాజేష్, అశోక్, అనిల్ పాల్గొన్నారు.

