మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా!
ఒకే తరహా కథనాలకే ప్రాధాన్యం ఇవ్వొద్దు
పాత వీడియోలు, ఫొటోల వెనుక వాస్తవాలు వెల్లడించాలి
హింసను ప్రేరేపించే కంటెంట్‌పై నిఘా పెంచాలి
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై వార్తలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని వినియోగదారులకు సిఫార్సు చేసే విధానాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తన కంటెంట్ సిఫార్సు, ర్యాంకింగ్ వ్యవస్థలను సమీక్షించాలని ఆదేశించింది. ఒకే తరహా కథనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుండా, విశ్వసనీయ సమాచారంలోని విభిన్న కోణాలు వినియోగదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అక్టోబర్ 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మెటాకు అడ్వైజరీ జారీ చేసింది. ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్స్‌ను ప్రదర్శించేటప్పుడు వాటి నేపథ్యాన్ని స్పష్టంగా తెలియజేయాలని కేంద్రం పేర్కొంది. అవి ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో, ప్రస్తుత ఘటనలకు సంబంధం ఉందో లేదో వినియోగదారులకు అర్థమయ్యేలా వివరాలు అందించాలని సూచించింది. పాత వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చూపడం, అత్యవసర పరిస్థితులు, ఆంక్షలు, పోలీసుల చర్యలపై ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో అపోహలు, ఆందోళనలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.
హింసను ప్రేరేపించే కంటెంట్‌పై నిఘా
తప్పుదారి పట్టించేలా మార్పులు చేసిన లేదా అసలు సందర్భం నుంచి వేరు చేసి చూపించే కంటెంట్‌ను పదేపదే సిఫార్సు చేయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. హింసను ప్రేరేపించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీసే సమాచారాన్ని వేగంగా గుర్తించి, పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునే వ్యవస్థలను బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. ప్రజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ప్రకటనలు, గ్రాఫిక్స్‌ను తగిన వివరణ లేకుండా విస్తృతంగా ప్రదర్శించడంపైనా ఆందోళన వ్యక్తం చేసింది.
దిల్లీ నిరసనల వేళ అడ్వైజరీ
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న నిరసనల నేపథ్యంలో కేంద్రం సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్న సమయంలో మెటా అల్గారిథమ్‌లు కొన్ని రకాల కంటెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయనే అంశం చర్చకు వచ్చినట్లు ఐటీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సమాచార సాంకేతిక చట్టం–2000, సమాచార సాంకేతిక నిబంధనలు–2021 ప్రకారం మెటా వ్యవహరించాలని కేంద్రం స్పష్టం చేసింది. పోలీసులు, ఇతర అధికారిక సంస్థలకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించాలని సూచించింది. తక్షణమే చర్యలు చేపట్టి, వాటి వివరాలను మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని కోరింది.

