వెల్నెస్ సెంటర్లో వైద్య సేవలు మెరుగుపరచాలి
మందుల పంపిణీలో జాప్యం నివారించాలి
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి
కాకతీయ, హనుమకొండ : వెల్నెస్ సెంటర్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, నిర్వహణను పటిష్టం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి ఆదేశించారు. సోమవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలోని వెల్నెస్ సెంటర్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డెంటల్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఫార్మసీ, ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మితను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓపీ సేవలు అందిస్తున్న వైద్యులతో మాట్లాడి, రోగుల సంఖ్య, వైద్య సేవల నిర్వహణపై ఆరా తీశారు. ఓపీ సేవల కోసం వస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని డాక్టర్ సుస్మిత కలెక్టర్కు వివరించారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేయడంతో పాటు ఆసుపత్రి ప్రాంగణంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. ఓపీకి వచ్చే రోగుల వివరాల నమోదు ప్రక్రియ, ఫార్మసీలో మందుల పంపిణీ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మందులు తీసుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రోగులకు వైద్యులు సూచించిన మందుల వివరాలను ఆన్లైన్లో త్వరగా నమోదు చేసి, మందుల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. డేటా ఎంట్రీలో జాప్యాన్ని నివారించేందుకు అదనపు కంప్యూటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని, వెల్నెస్ సెంటర్లో పరిశుభ్రతతో పాటు నిర్వహణను మెరుగుపరచాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


