దేవరుప్పులలో రైతుల కోసం పోరుబాట!
మండలాన్ని తక్షణమే కరువుగా ప్రకటించాలి
నీళ్లడిగితే కేసులు పెడతారా? రైతుల కోసం చావడానికైనా సిద్ధం
బీఆర్ఎస్ నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి
కాకతీయ, దేవరుప్పుల: సాగునీరు లేక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ జనగామ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. దేవరుప్పుల మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పల్లా సుందర్ రాంరెడ్డి మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమపై కోపం ఉంటే ఎన్ని కేసులైనా పెట్టుకోవాలని, కానీ రైతులకు మాత్రం సాగునీరు అందించాలని అన్నారు. పక్క నియోజకవర్గాల్లో పరిస్థితులను చూసైనా పాలకులు స్పందించాలని వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు, ఎండిపోతున్న పంటలు కనిపించడం లేదా అంటూ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. రైతులను ఆదుకోకుండా కాలయాపన చేస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుల కోసం పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

