రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్’ పాదయాత్ర
త్వరలోనే ప్రణాళిక విడుదల చేస్తాం
కాంగ్రెస్ సర్కారు మోసాలను ఇంటింటికీ వివరిస్తాం
మిల్లుల వద్ద రైతుల అవస్థలు.. తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ
ప్రజా సమస్యలు వదిలి నాయకుల కొనుగోళ్లపైనే ప్రభుత్వ ధ్యాస
: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాకతీయ, మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిట్టనిలువునా మోసం చేస్తోందని, రైతుల్లో భరోసా నింపేందుకు త్వరలోనే జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మండలం రాంరెడ్డిగూడెం మిల్లు వద్ద ధాన్యం విక్రయించేందుకు వాహనాల్లో వేచి చూస్తున్న రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రతి రైతును కలిసి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామని, త్వరలోనే పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి కార్యాచరణను విడుదల చేస్తామని వెల్లడించారు.
రైతు సమస్యలపై పోరాటమే లక్ష్యం
రైతులకు గిట్టుబాటు ధర, సకాలంలో యూరియా, కరెంటు, రైతుబంధు అందించడంతో పాటు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. “రైతు భీమా అమలు చేయాలి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి. రైతుల సమస్యలు పట్టించుకోని ఈ ప్రభుత్వంపై ప్రజలందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం ధాన్యం కొనే వరకు మీ వెంటే ఉంటాం” అని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ వరంగల్ సభ ప్రకటన రాగానే భయంతో పాత పద్ధతిలో కొనుగోళ్లు ప్రారంభించారని, అయితే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల మిల్లర్లు తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మిల్లుల వద్ద రైతుల నుంచి 40 కేజీలకు 3 నుంచి 4 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, కరెంటు, యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్లాల వద్దే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి, సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించామని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సర్పంచులు, కార్పొరేటర్లు, ఇతర నాయకులను డబ్బుతో కొనాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు యూరియా, కరెంటు ఇవ్వకుండా, ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ‘రైతు వారోత్సవాలు’ చేస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని ఆయన హెచ్చరించారు.

