తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి
నీళ్లు ఉండి పొలాలకు అందివ్వలేని దుస్థితి
35 టీఎంసీలు ఏపీకి.. తెలంగాణ ఎత్తింది 7 టీఎంసీలే
పాలమూరు ప్రాజెక్టుల మోటార్లు బంద్ పెట్టారు
కల్వకుర్తిలో 4,000 క్యూసెక్కుల సామర్థ్యానికి 700 క్యూసెక్కులే
రైతుల ధర్నాలు కనిపించడం లేదా?
ముఖ్యమంత్రి రేవంత్ పాలన ఘెర వైఫల్యం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
కాకతీయ, తెలంగాణబ్యూరో : కండ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పాలన ఇది.. పంటలను కాపాడలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువు అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. పాలమూరు బిడ్డను అని విర్రవీగే రేవంత్‌రెడ్డి కృష్ణా జలాలు ఎత్తకుండా పాలమూరు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. పాలమూరు పులి అంటూ నీటి వినియోగంలో మాత్రం పిల్లిలా ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగానికి నీళ్లు నిల్లు.. ఏపీ రైతాంగానికి నీళ్లు ఫుల్లు అన్నట్టుగా పరిస్థితి మారిందని ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంప్‌హౌస్‌లో 5 మోటార్లు 24 గంటలు నడపాల్సి ఉండగా కేవలం 2 మోటార్లే నడుస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. అవి కూడా ఆన్ అండ్ ఆఫ్‌గా నడుస్తున్నాయని, సగటున రోజుకు 11 గంటలే మోటార్లు పనిచేస్తున్నాయని చెప్పారు. రోజుకు 1600 క్యూసెక్కులు రావాల్సిన చోట 700 క్యూసెక్కులే వస్తున్నాయని, 4000 క్యూసెక్కులు ఎత్తగలిగే సామర్థ్యం ఉన్నా ప్రభుత్వం కేవలం 700 క్యూసెక్కులే ఎత్తుతోందని విమర్శించారు. బీమా ప్రాజెక్టులో 3 మోటార్లకు ఒకటి, నెట్టంపాడులో 4 మోటార్లకు ఒకటి, కోయిల్‌సాగర్‌లో 3 మోటార్లకు ఒకటి మాత్రమే నడుపుతున్నారని తెలిపారు. ఎల్‌నినో ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తాల్సి ఉండగా.. ఎత్తగలిగే అవకాశం ఉండి కూడా మోటార్లు బంద్ పెట్టారని విమర్శించారు. బేసిన్లో లేని వెలిగొండ ద్వారా చంద్రబాబు నీళ్లు తీసుకుపోతుంటే.. బేసిన్లో ఉన్న, కృష్ణా జలాల కేటాయింపు ఉన్న బీమా ప్రాజెక్టును ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు.
బాబు గారికి గురుదక్షిణా?
పాలమూరు ప్రాంతంపై రేవంత్‌రెడ్డికి ఉన్న ప్రేమ వట్టి మాటలేనని హరీశ్‌రావు విమర్శించారు. బాబు గారికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? వెలిగొండ, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకుపోయేందుకు సహకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వరప్రదాయినిగా ఉన్న కృష్ణా జలాలు ఏపీకి వరప్రదాయినిగా మారాయని ఆరోపించారు. పాలమూరు, నల్లగొండ జిల్లాల ప్రజలు సాగు, తాగునీటి కోసం తండ్లాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు అర్ధనగ్న ప్రదర్శనలు, పొంగులేటి నియోజకవర్గంలో రైతులు ధర్నాలు చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా సబ్స్టేషన్ల ముందు రైతులు నీళ్ల కోసం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. కల్వకుర్తికి గత 30 ఏళ్లలో 13 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 3.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని హరీశ్‌రావు అన్నారు. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు రూ.4000 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. శ్రీశైలంలో తెలంగాణకు ఉన్నవి కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులేనని, పాలమూరు ప్యాకేజీ-3 పనులను నెల రోజులు కష్టపడితే పూర్తి చేయవచ్చని అన్నారు. మూడేళ్లుగా ఆ పని చేయడం లేదని, ప్యాకేజీ పూర్తయితే 5–6 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కావడంతో ఆయనకు కీర్తి వస్తుందనే ఉద్దేశంతోనే పాలమూరు ప్యాకేజీని పడావు పెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు.
ఏపీకి 35 టీఎంసీలు.. తెలంగాణకు 7 టీఎంసీలు
అధికారిక లెక్కల ప్రకారం శ్రీశైలం నుంచి ఏపీ 35 టీఎంసీల నీటిని తీసుకుపోయిందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ మాత్రం 7 టీఎంసీలు మాత్రమే ఎత్తుకుందని చెప్పారు. 2024–25లో కృష్ణా జలాల వినియోగం 28.49 శాతం, 2025–26లో 25.77 శాతానికే పరిమితమైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ మూడేళ్లలోనే అత్యల్పంగా కృష్ణా జలాల వినియోగం జరిగిందని, ఉన్న తాత్కాలిక వాటాను కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. 6 లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించిన చేవలేని ప్రభుత్వం ఇదేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ పోరాటం చేసిన తర్వాతే సాగర్‌కు కొద్దికొద్దిగా నీళ్లు ఇస్తున్నారని, బీఆర్ఎస్ నిలదీస్తే తప్ప ప్రభుత్వం మొద్దు నిద్ర వీడదా? అని ప్రశ్నించారు. బేసిన్లో లేని వెలిగొండకు నీళ్లు.. బేసిన్లో ఉన్న మహబూబ్‌నగర్‌కు నీళ్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుకు కావాల్సింది పవర్ పాయింట్ కాదు
నీళ్లు ఉండి ఎత్తలేని పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండి కరెంట్ ఉత్పత్తి చేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని హరీశ్‌రావు విమర్శించారు. యాదాద్రి పవర్‌ప్లాంట్, భద్రాద్రి కొత్తగూడెం సోలార్ వంటి ప్రాజెక్టులు తీసుకొచ్చినా వాటిని సక్రమంగా నడపడం లేదన్నారు. కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల ప్లాంట్‌ను, 540 మెగావాట్ల బీటీపీఎస్ యూనిట్లు 3, 4ను మూసేశారని చెప్పారు. యాదాద్రిలో 4000 మెగావాట్ల సామర్థ్యానికి 2000 మెగావాట్లే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. ఒకవైపు బొగ్గు సర్‌ప్లస్‌గా ఉందంటూ.. మరోవైపు యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేయడం లేదని విమర్శించారు. మూడేళ్లలో ఒక్క ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ కూడా నిర్మించలేదని, రైతులకు ఇచ్చే పవర్ లేదని.. ప్రతిపక్షాల పీక నొక్కడానికి మాత్రం పవర్ ఉందని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాడు కరెంట్ లేదని విమర్శలు చేశారని, ఇప్పుడు 7 గంటలు కూడా కరెంట్ రావడం లేదని అన్నారు. లాగ్‌బుక్స్ ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు.
సస్పెన్షన్లు కాదు.. మోటార్లు ఆన్ చేయాలి
అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడితే మార్షల్స్ పెట్టి బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపించారని హరీశ్‌రావు అన్నారు. మమ్మల్ని కాదు.. మోటార్లు ఆన్ చేసి కృష్ణా నీళ్లు ఎత్తండి రేవంత్‌రెడ్డి అని సూచించారు. రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ప్రభుత్వం సస్పెన్షన్ల బిజీలో ఉందని విమర్శించారు. రైతులకు కావాల్సింది బూతులు కాదని, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కాదని.. పంపులకు పవర్, పొలాలకు సాగునీరు కావాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రకృతి వైపరీత్యం కావచ్చని, అయితే నీరు అందుబాటులో ఉండి కూడా రైతులకు అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మౌనం తెలంగాణ తాగు, సాగునీటి ప్రయోజనాలకు శాపంగా మారుతోందని విమర్శించారు. ఏపీ నీటి తరలింపునకు వెంటనే అడ్డుకట్ట వేయాలని, అవసరమైతే అపెక్స్ కౌన్సిల్‌ను డిమాండ్ చేయాలని హరీశ్‌రావు కోరారు. పాలమూరు అన్ని ప్రాజెక్టుల మోటార్లను ఆన్ చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలని, సాగర్ కాల్వకు నీళ్లు విడుదల చేసి నల్లగొండ పొలాలకు మళ్లించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్‌లోనూ లిఫ్టులు బందే
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేముల ప్రశాంత్‌రెడ్డి: నిజామాబాద్ జిల్లా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, పరిస్థితులు బాగాలేవని అసెంబ్లీలో మాట్లాడాలని రైతులు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలను సభలో ప్రస్తావిస్తామని అడిగినందుకు తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని అన్నారు. వర్షాల కారణంగా ఎస్సారెస్పీలో 46 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, గుత్ప, అలీసాగర్ లిఫ్టులు ప్రారంభించి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తే తూతూమంత్రంగా గుత్ప లిఫ్టులు ఆన్ చేశారని విమర్శించారు. 4 మోటార్లకు ఒక్క మోటారే నడుపుతున్నారని, వెంటనే పూర్తి స్థాయిలో గుత్ప లిఫ్టును నడిపి అన్ని చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. అలీసాగర్ సామర్థ్యం 720 క్యూసెక్కులు కాగా 4 మోటార్లకు సగమే నడుపుతున్నారని, అవి కూడా ఆన్ అండ్ ఆఫ్‌గా నడుస్తున్నాయని చెప్పారు. గుత్ప, అలీసాగర్ కలిపి రోజుకు 1260 క్యూసెక్కులు నడిపితే నెల రోజుల్లో 3 టీఎంసీలు మాత్రమే అవుతాయని, తద్వారా ఉన్న చెరువులన్నీ నింపవచ్చని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని లక్ష్మీ కెనాల్‌కు నిండుగా నీళ్లు ఇవ్వాలని, చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్టుతో పాటు ఇతర అన్ని లిఫ్టులను వెంటనే ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

