సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశం
కాకతీయ, నెల్లికుదురు: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. బుధవారం నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యాసంస్థల్లో వంట సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక అందించాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు టీకాలు సకాలంలో వేయాలని సూచించారు. మందుల నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని, బోదకాలు, గర్భాశయ క్యాన్సర్ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ ప్రతి సబ్జెక్టుపై పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ నుంచే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాలని, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మదర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో కుమార్, ప్రిన్సిపల్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

