రాహుల్, ప్రియాంకలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళన..
* మోదీ దిష్టిబొమ్మ దహనం
* ఓటు చోరీపై ప్రశ్నిస్తే లాఠీచార్జ్ చేస్తారా?
* కేంద్ర ప్రభుత్వ తీరుపై చేర్యాలలో కాంగ్రెస్ నిరసన
కాకతీయ,చేర్యాల: బీజేపీపై “ఓట్ చోరీ” ఆరోపణల నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు చేర్యాల పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.చేర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంజె మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా దాసరి శ్రీకాంత్, మంజె మల్లేశం మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన హక్కు అని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడుతూ ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.ఓట్ చోరీపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులు, ఎంపీలపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య నిరసనలను అణిచివేసే చర్యగా కాంగ్రెస్ నాయకులు అభివర్ణించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నాయకులు, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన చర్యలను ఖండిస్తూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పోరాడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, గ్రామశాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

