రైతుల సొమ్ము రూ.80 కోట్లు గోల్మాల్!
మాజీ జేడీఎం శ్రీనివాస్ ఆస్తులపై ఏసీబీ విచారణకు డిమాండ్
రైతులకు జరిగిన నష్టంపై సమగ్ర దర్యాప్తు జరపాలి
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి తెలంగాణ రైతు సంఘం ఫిర్యాదు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు అందాల్సిన సుమారు రూ.80 కోట్ల సొమ్ము దుర్వినియోగమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖతో విచారణ జరిపించాలని, ఆయనను ఉద్యోగం నుంచి పూర్తిస్థాయిలో తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
27 ఏళ్లు వరంగల్ రీజియన్లోనే
1996లో సీనియర్ మార్కెటింగ్ అధికారిగా ఆదిలాబాద్లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఉప్పుల శ్రీనివాస్.. 30 ఏళ్ల సర్వీసులో మూడేళ్లు మినహా 27 ఏళ్లు వరంగల్ రీజియన్ పరిధిలోనే పనిచేశారని చందర్రావు ఆరోపించారు. పై అధికారులు, ప్రభుత్వ పెద్దలను తన వాక్చాతుర్యంతో ప్రభావితం చేసుకుంటూ వ్యవహరించారని విమర్శించారు. ఎక్కడ పనిచేసినా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్పై తన ప్రభావం కొనసాగించారని పేర్కొన్నారు. 2012 నుంచి 2023 ఏప్రిల్ వరకు వరంగల్ మార్కెట్లో రైతుల గన్నీ సంచులకు వ్యాపారులు చెల్లించాల్సిన ఛార్జీలు రూ.50–60 కోట్లు, దడవాయి ఛార్జీలు మరో రూ.10 కోట్లు, భారత పత్తి సంస్థ 2012–13, 2014–15లో కొనుగోలు చేసిన 31,94,000 గన్నీలకు సంబంధించి సుమారు రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.80 కోట్ల మేర రైతులు నష్టపోయారని చందర్రావు ఆరోపించారు. ఈ మొత్తం వ్యాపారులకు లబ్ధి చేకూర్చిందని, ఇందుకు శ్రీనివాస్ సహకరించారని పేర్కొన్నారు.
రైతుల గన్నీ సంచులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని రైతు సంఘం కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ఈ కేసును సాకుగా చూపి మార్కెట్లోని మూడు గోదాముల్లో 5 లక్షల గన్నీలు ఉన్నాయంటూ గత 13 ఏళ్లుగా తాళాలు వేసి ఉంచారని, దీంతో మార్కెట్ కమిటీకి సుమారు రూ.2 కోట్ల అద్దె ఆదాయం నష్టం వాటిల్లిందని విమర్శించారు.
బినామీ రైతుల ధ్రువీకరణపై ఆరోపణలు
పత్తి, కౌలు రైతులను ధ్రువీకరించే అధికారాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై, పర్సంటేజీల ప్రాతిపదికన బినామీ రైతులను ధ్రువీకరించారని చందర్రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వరంగల్ రీజియన్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని పేర్కొంటూ, మాజీ జేడీఎం ఆస్తులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చందర్రావు తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు పానుగంటి నరసయ్య, నార్ల చంద్రశేఖర్, మాదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

