డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి
నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సేవామూర్తి
అణగారిన వర్గాల హక్కుల కోసం 20 ఏళ్లుగా పోరాటం
బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోత సునిత డిమాండ్
కాకతీయ, హైదరాబాద్ : నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తూ, దళిత బహుజనుల హక్కుల కోసం 20 ఏళ్లుగా సేవలందిస్తున్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు నవంబర్లో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోత సునిత డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. డాక్టర్ రామకృష్ణ తన రామకృష్ణ ఆసుపత్రి ద్వారా వేలాది మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, రామకృష్ణ ట్రస్ట్, కేమాక్స్ సహకార సంస్థ ద్వారా పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని తెలిపారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో దళితుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3) ప్రకారం సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష సేవలందించిన వారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్, మంత్రులు చొరవ తీసుకుని మాదిగ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, అణగారిన వర్గాల గొంతును శాసన మండలిలో వినిపించే అవకాశం ఇవ్వాలని పోత సునిత విజ్ఞప్తి చేశారు.

