బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు
భర్త హత్య కేసులో భార్య, ప్రియుడికి ఉరిశిక్ష
మృతదేహాన్ని ముక్కలుగా చేసి డ్రమ్‌లో సిమెంట్‌తో పూడ్చిన వైనం
126 విచారణలు.. 22 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తీర్పు
కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య కేసులో మేరఠ్ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి నీలిరంగు డ్రమ్‌లో ఉంచి సిమెంట్‌తో పూడ్చిపెట్టిన కేసులో భార్య ముస్కాన్ రస్తోగీ, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు ఉరిశిక్ష విధించింది. నిందితులిద్దరూ క్షమించరాని నేరానికి పాల్పడ్డారని జిల్లా న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా తీర్పులో పేర్కొన్నట్లు అందించిన సమాచారం వెల్లడిస్తోంది. సెప్టెంబరు 30న నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు, బుధవారం తుది విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. భద్రతా కారణాలతో ఇద్దరినీ జైలు నుంచి వర్చువల్ విధానంలో కోర్టు ఎదుట హాజరుపరిచారు. సుమారు ఏడాదిన్నర పాటు సాగిన విచారణలో ప్రాసిక్యూషన్ 126 విచారణలు నిర్వహించగా, సుమారు 22 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. హత్యతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసిన తీరుపై కోర్టు తీవ్రంగా స్పందించింది. నిందితులిద్దరికీ ఉరిశిక్ష విధించడంతో పాటు వివిధ సెక్షన్ల కింద రూ.20 వేల జరిమానా కూడా విధించింది. తీర్పుపై సౌరభ్ రాజ్‌పుత్ తల్లి రేణు దేవి హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడిని హత్య చేసిన వారికి మరణశిక్ష విధించడంతో న్యాయం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. కేసు విచారణలో సహకరించిన న్యాయవాదులు, సహోద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురైతే విడిపోవడమే మార్గమని, ప్రాణాలు తీసేంతటి దారుణాలకు పాల్పడకూడదని ఆమె పేర్కొన్నారు.

