టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు!
వార్తల ప్రసారంలో నియమావళి ఉల్లంఘనలకు చెక్
ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారంపై నిషేధం
హింసాత్మక దృశ్యాల ప్రసారంలో సంయమనం పాటించాలి
నేర వార్తల్లో వాస్తవాలకే ప్రాధాన్యం ఇవ్వాలి
మత సామరస్యానికి భంగం కలిగించే చర్చలకు తావివ్వొద్దు
కృత్రిమ మేధ వినియోగంలోనూ అప్రమత్తత తప్పనిసరి
న్యూ ఢిల్లీ : టెలివిజన్ వార్తా ఛానళ్ల ప్రసారాలపై కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వార్తల సేకరణ నుంచి ఎడిటింగ్, నిర్మాణం, ప్రసారం వరకు ప్రతి దశలో కార్యక్రమాల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ప్రైవేటు ఉపగ్రహ టీవీ ఛానళ్లకు సూచించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నియంత్రణ చట్టం–1995, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నియమాలు–1994లోని నిబంధనలను అక్షరాలా అమలు చేయాలని స్పష్టం చేసింది. వార్తలు, దృశ్యాల ప్రసారంలో ఒకే అంశాన్ని పదేపదే చూపించడం, అనుచిత ప్రవర్తనను సాధారణంగా చూపించడం, వాస్తవాలు నిర్ధారించకుండా సమాచారాన్ని ప్రసారం చేయడం వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భద్రతా దళాలు నిర్వహించే ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లను టీవీ ఛానళ్లు ప్రత్యక్షంగా ప్రసారం చేయకూడదని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆపరేషన్ పూర్తయ్యే వరకు అధీకృత అధికారి ఇచ్చే సమాచారానికే పరిమితమవ్వాలని సూచించాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు అవసరమైన చోట సమయ సూచికలను జోడించాలని పేర్కొన్నాయి.
హింసాత్మక దృశ్యాల ప్రసారంలో సంయమనం
హత్యలు, ప్రమాదాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు సంపాదకీయ విచక్షణ పాటించాలని కేంద్రం సూచించింది. ప్రేక్షకులకు అనవసరమైన మానసిక ఆందోళన కలిగించే దృశ్యాలను పదేపదే చూపించకూడదని పేర్కొంది. అవసరమైన సందర్భాల్లో చిత్రాలను అస్పష్టంగా చూపించడం, ముఖాలు లేదా ఇతర వివరాలను కప్పివేయడం వంటి పద్ధతులను అనుసరించాలని సూచించింది. నేరాలను సంచలనాత్మకంగా చూపించి చట్టవిరుద్ధమైన లేదా సామాజికంగా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను గొప్పగా చిత్రీకరించకూడదని స్పష్టం చేసింది. నేరాలు, హత్యలు, హింసాత్మక ఘటనలపై వార్తలు ప్రసారం చేసేటప్పుడు ధ్రువీకరించిన వాస్తవాలకే ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించే సమాచారం, అర్ధసత్యాలు, ఆధారాలు లేని సూచనలకు తావివ్వకూడదని సూచించాయి. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని స్పష్టం చేశాయి. లైంగిక నేరాల బాధితుల గుర్తింపును వెల్లడించే ప్రత్యక్ష లేదా పరోక్ష వివరాలను ప్రసారం చేయకూడదని పేర్కొన్నాయి.
మత సామరస్యానికి భంగం కలిగించొద్దు
టీవీ చర్చలు, ప్రత్యక్ష కార్యక్రమాలు, ప్యానెల్ చర్చల్లో మత విద్వేషాన్ని లేదా దేశవ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించే అంశాలకు అవకాశం ఇవ్వకూడదని కేంద్రం సూచించింది. చర్చల్లో పాల్గొనే వారి ఎంపిక, కార్యక్రమానికి ముందు అవసరమైన అవగాహన కల్పించడం, సంపాదకీయ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొంది. అవసరమైన సందర్భాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలను నిలిపివేయడం, వివరణ ఇవ్వడం, ప్రసారాన్ని తాత్కాలికంగా ఆపడం లేదా నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రకృతి విపత్తులు, పెద్ద ప్రమాదాలు, ఇతర అత్యవసర ఘటనలకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు సమయ సూచికలను అవసరమైన చోట చేర్చాలని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. నిర్ధారించని సమాచారంతో ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించకూడదని సూచించాయి. ఘటనలపై వార్తలు వాస్తవాల ఆధారంగా, బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేశాయి.
కృత్రిమ మేధ వినియోగంలోనూ అప్రమత్తత
వార్తా కార్యక్రమాలు, గ్రాఫిక్స్, దృశ్యాల రూపకల్పనలో కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించేటప్పుడు ఛానళ్లు జాగ్రత్త వహించాలని కేంద్రం సూచించింది. ఈ సాధనాలను సహాయకంగా ఉపయోగించవచ్చని, అయితే వార్తా సమాచారంలోని కచ్చితత్వం, ప్రామాణికత, సున్నితత్వం దెబ్బతినకూడదని స్పష్టం చేసింది. కార్యక్రమాల నియమావళిని పాటించడం ప్రతి ఛానల్‌కు చట్టబద్ధమైన బాధ్యత అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నియంత్రణ చట్టం–1995, దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. వార్తల సేకరణ, ఎడిటింగ్, నిర్మాణం, ప్రసారం, టెలికాస్ట్‌లో పాల్గొనే సిబ్బందికి నియమావళిపై అవగాహన కల్పించాలని, ఎడిటోరియల్, ప్రొడక్షన్ బృందాలకు క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఛానళ్లకు సూచించింది.

