ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే
ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండ
సమస్యలపై అధ్యయనం చేసి మద్దతుగా నిలుస్తాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాకతీయ, హైదరాబాద్ : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వారి పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ మహేందర్రావు, అధికార ప్రతినిధి డాక్టర్ బోడ శ్రీనివాస్, హనుమకొండ జిల్లా బాధ్యుడు వినయ్కుమార్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జేఏసీ బాధ్యుడు కుమార్ తదితరులు హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, తమ డిమాండ్లను వివరించి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, హక్కుల సాధనకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు.

