సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యలు సరికాదు!
పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా వ్యవహరిస్తే సహించం
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్
కాకతీయ, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై పదేపదే విమర్శలు చేయడం ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాపాలన కోసం వేలాది మంది కార్యకర్తలు జైళ్లకు వెళ్లి, అరెస్టులు ఎదుర్కొని పదేళ్ల పాటు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ పోరాటంలో రాజగోపాల్‌రెడ్డి త్యాగం ఏమీ లేదని, ఎన్నికల సమయంలో వచ్చి బీఫారం తీసుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా అవకాశాలు కల్పించిన పార్టీపై విషపు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బీజేపీ తరఫున గెలవలేక కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు నిధుల కోసం సీఎంను కలిసి ప్రయత్నిస్తున్నారని, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే వారిపై ఉదారత చూపకుండా తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

