ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్!
ఏరోస్పేస్ పెట్టుబడులకు ప్రత్యేక కార్యాచరణ
విమాన విడిభాగాల తయారీకి స్థానికంగానే టూలింగ్ సదుపాయాలు
‘టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి
కాకతీయ, హైదరాబాద్ : ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విమాన విడిభాగాల తయారీతోపాటు వాటి అసెంబ్లీ, మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన టూలింగ్, అధునాతన యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోనే అందుబాటులోకి తెచ్చేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో జేఈహెచ్ ఏరోస్పేస్ ఏర్పాటు చేసిన ‘టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. విమానాలు, విమాన ఇంజిన్ల అసెంబ్లీ, మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన ప్రత్యేక టూల్స్, ఫిక్చర్లు, గేజ్‌ల తయారీ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని అధునాతన తయారీ, ఏరోస్పేస్, రక్షణ, సాంకేతిక రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా సమగ్ర పారిశ్రామిక వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా రూపొందిస్తున్నామన్నారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రెసిషన్ తయారీ, పరీక్షల విభాగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.
‘మేడిన్ తెలంగాణ’కు మరింత గుర్తింపు
ప్రత్యేక పరికరాలు, ఫిక్చర్లు, గేజ్‌ల కోసం ఇప్పటివరకు విదేశాలు లేదా కొద్దిమంది సరఫరాదారులపై ఆధారపడాల్సి వచ్చేదని శ్రీధర్‌బాబు వివరించారు. హైదరాబాద్‌లోనే అధునాతన టూలింగ్ సామర్థ్యాలు అందుబాటులోకి రావడం పారిశ్రామిక రంగానికి ఊతమిస్తుందన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు, దేశీయ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అనుసంధానించడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఏరోస్పేస్ ప్రపంచ సరఫరా వ్యవస్థలో ‘మేడిన్ తెలంగాణ’కు మరింత గుర్తింపు లభించేందుకు ఇలాంటి కేంద్రాలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, జేఈహెచ్ ఏరోస్పేస్ సీఈవో విశాల్ సంఘావి, సీవోవో వెంకటేష్ ముద్రగళ్ల తదితరులు పాల్గొన్నారు.

