అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం
475 జిలెటిన్ స్టిక్స్, 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్ పట్టివేత
రెండు కంప్రెసర్ ట్రాక్టర్లు సీజ్.. ఒకరి అరెస్ట్
కాకతీయ, కరీంనగర్: అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న వ్యక్తిని కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామడుగు మండలం శ్రీరాములపల్లెకు చెందిన వేముల భూమయ్య (45) వద్ద పేలుడు పదార్థాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 475 జిలెటిన్ స్టిక్స్, సుమారు 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్ (3 బండిళ్లు), రెండు కంప్రెసర్ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ల నంబర్లు టీఎస్ 02 యూసీ 2690, టీజీ 02 టీ 0082గా పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ట్రాక్టర్లను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సైదాపూర్ పోలీసులకు అప్పగించినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ తెలిపింది.

