మిత్రుల జైలు జీవితం.. అభిజీత్ దిప్కే భావోద్వేగం!
సౌకర్యవంతమైన జీవితాలను వదిలి ప్రజల కోసం పోరాటం
జంతర్‌మంతర్ వద్ద జాతీయ జెండా ఎగరేసినందుకు అరెస్టు
అశుతోష్, సౌరవ్ త్యాగాలను ఎక్స్‌లో పంచుకున్న కాక్రోచ్ పార్టీ నేత
కాకతీయ, నేషనల్ డెస్క్ : ప్రజల కోసం పోరాడుతూ జైలు పాలైన తన మిత్రులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ల త్యాగాలను గుర్తుచేసుకుంటూ కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే భావోద్వేగానికి గురయ్యారు. దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే ఆశతో వారు తమ సౌకర్యవంతమైన జీవితాలను వదిలి ప్రజా ఉద్యమంలోకి వచ్చారని ఎక్స్ వేదికగా చేసిన సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అశుతోష్ రాంకా లండన్‌లో అత్యధిక వేతనం వచ్చే కార్పొరేట్ ఉద్యోగంలో ఉండేవారని, లక్షలాది రూపాయలు సంపాదించేవారని దిప్కే గుర్తుచేశారు. సౌరవ్ దాస్ దేశ న్యాయవ్యవస్థ గురించి రచనలు చేస్తూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేవారని తెలిపారు. ఇద్దరికీ విజయవంతమైన వృత్తి జీవితాలు, ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ వాటిని కొనసాగించకుండా ప్రజల కోసం పోరాటాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు. వీధుల్లోకి వచ్చి అనిశ్చితిని ఎదుర్కొంటూ చివరకు జైలు పాలవ్వాల్సిన అవసరం వారికి లేదని, అయినా దేశం కోసం ఆ మార్గాన్ని ఎంచుకున్నారని అభిజీత్ దిప్కే వ్యాఖ్యానించారు.
తెలియని వారి కోసం పోరాటం..
తమకు అదృష్టం కలిసివచ్చినప్పటికీ, అలాంటి అవకాశం లేని వారి కోసం పోరాడాలని అశుతోష్, సౌరవ్ నిర్ణయించుకోవడం తనను ఆకట్టుకుందని దిప్కే తెలిపారు. ఇతరుల కష్టాలను పట్టించుకోకుండా తమ జీవితాలను ఆనందంగా గడిపే అవకాశం వారికీ ఉందన్నారు. ఎవరూ వారిని త్యాగాలు చేయాలని అడగలేదని, ఆశించలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధతో వారు ఉద్యమంలోకి వచ్చారని కొనియాడారు. నీట్ అక్రమాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీని దేశవ్యాప్త ఉద్యమంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ఉన్నారు. జంతర్‌మంతర్ వద్ద ఆంక్షలను ఉల్లంఘించి జాతీయ జెండా ఎగరేశారనే కారణంతో వారిని అరెస్టు చేసి న్యాయ నిర్బంధానికి పంపినట్లు కథనంలో పేర్కొన్నారు. వారి పిటిషన్లపై విచారణ ఆలస్యం కావడంతో వారు జైలులోనే ఉన్నారు.
“ఇతరుల కోసం నిలబడటమే గొప్ప లక్షణం”
తమకు తెలియని వ్యక్తుల కోసం నిలబడటం, తమవి కాని పోరాటాలను చేపట్టడం, మరొకరికి మెరుగైన జీవితం లభించాలనే ఆశతో తమ దగ్గర ఉన్నదంతా పణంగా పెట్టడం మనిషికి ఉండగలిగే అత్యుత్తమ లక్షణమని అభిజీత్ దిప్కే పేర్కొన్నారు. అశుతోష్, సౌరవ్ అలాంటి వ్యక్తులని ప్రశంసిస్తూ తన పోస్టును ముగించారు.

