తనూజ రంజన్ హత్య కేసులో కీలక మలుపు!
నేపాల్‌లో ప్రధాన నిందితురాలి ఆచూకీ
విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో పోలీసుల పురోగతి
దోచుకున్న నగలు, కుట్ర వెనుక ఇతరుల పాత్రపై దర్యాప్తు
ఆరు నెలలుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు
కాకతీయ, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ రంజన్ హత్య కేసులో కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఆరు నెలలుగా గాలిస్తున్న హైదరాబాద్ పోలీసులు ప్రధాన నిందితురాలు కల్పన ఆచూకీని నేపాల్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2026 మే 7 అర్ధరాత్రి తర్వాత తనూజపై దాడి జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వినయ్ రంజన్ రే బెంగళూరులో ఉన్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తనూజ ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం నగలు, నగదు, విలువైన వస్తువులతో నిందితులు పరారయ్యారు. కుటుంబ సంరక్షకురాలిగా పనిచేసేందుకు వచ్చిన నేపాల్‌కు చెందిన కల్పన, ఇతర నిందితులతో కలిసి దోపిడీ పథకంలో భాగంగా హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నేరం అనంతరం నిందితులు బీహార్ సరిహద్దుల మీదుగా నేపాల్‌కు చేరుకున్నట్లు భావిస్తున్నారు. కల్పన ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రెండు నెలలపాటు నేపాల్‌లో మకాం వేసి గాలించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇద్దరి అరెస్టు
ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిలో సునీల్ బహదూర్ ఔజీపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకుని జైలుకు తరలించినట్లు సమాచారం. ఇంట్లోని వ్యక్తుల కదలికలు, కుటుంబ సభ్యుల సమయాలను గమనించి అదును చూసి నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంపై కొందరు సిబ్బందికి ఛార్జిమెమోలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితురాలు కల్పనను విచారిస్తే హత్యకు సంబంధించిన పూర్తి కుట్ర, ఇతర నిందితుల పాత్ర, దోచుకున్న నగలు ఎక్కడికి చేరాయనే అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో నగరంలో సంచలనం సృష్టించింది. నిందితులందరినీ పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

