పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి.
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు.
కాకతీయ, పెద్దవంగర :
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పెద్దవంగర మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, పంటలు ఎండిపోయి రైతులు నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించక పోవడం స్థానిక ఎమ్మెల్యే అసమర్థతేనని విమర్శించారు. వెంటనే పెద్దవంగర మండలంలో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కరువు మండలంగా ప్రకటించాలని, లేని పక్షంలో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు సుదీర్, సంజయ్, వెంకన్న, భాస్కర్, పటేల్ నాయక్, రవి, యాకన్న, స్వామి,బాలు, భీమా నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

