ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
:తహసీల్దార్
కాకతీయ, పెద్దవంగర :ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్, ఎంపిడిఓ లు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హత కలిగిన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలన్నారు. ఈనెల 19వ తేదీ నుంచి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలలో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద మండలంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించబడుతుందని, కుటుంబంలో జీవనోపాధికి ప్రధానంగా ఆధారపడే వ్యక్తికి బీమా వర్తిస్తుందన్నారు.18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులైన వారు ఈ పథకం పరిధిలోకి వస్తారని, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు, రేషన్ కార్డు లేని కుటుంబాలు సైతం ఈ పథకానికి అర్హులేనని వారు తెలిపారు. బీమా ప్రయోజనం పొందే వ్యక్తి ఒకరిని లేదా ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకోవచ్చని వారు సూచించారు.

